చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రత్యేకంగా ఆహ్వానించిన హీరో నాగార్జున
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : నట సామ్రాట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతిని పురస్కరించుకొని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ఏఎన్‌ఆర్-100 కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు వారి జీవితకాల విజయాలు, కృషికి, వ్యక్తులను గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రదానం చేస్తూ వస్తున్నారు.
ఈ సారి 2024కి గాను ANR జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి అందించనున్నట్లు నాగార్జున (Nagarjuna) ప్రకటించింది తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 25న) స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానం అందజేశారు.
ఈ మేరకు నాగ్ ట్విట్టర్ ద్వారా చిరుతో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ" మా నాన్నగారి ANR 100వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం మెగాస్టార్ చిరంజీవిని, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లను ఆహ్వానించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. ANR అవార్డ్స్ మైలురాయికి గుర్తుగా.. 2024 అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు ఉంటాయి. అందరు రండి ఈ అవార్డు ఫంక్షన్‌ను మరపురానిదిగా చేద్దాం!" అంటూ తన అభిప్రాయన్ని పంచుకున్నారు.
కాగా ఈ ప్రతిష్ట్మాతకమైన అవార్డును అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి అందుకోనున్నారు. బిగ్ బీ అమితాబ్‌ని కూడా నాగార్జున త్వరలోనే మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించనున్నారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇకపోతే ANR జాతీయ అవార్డును తొలిసారిగా 2006లో ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు అందించారు.