జగన్ కుటుంబంలో ఆస్తులపై అంతర్యుద్ధం
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు భారత్ ప్రతినిధి : వైఎస్ కుటుంబంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్పై ఆధిపత్యం కోసం వైసీపీ అధినేత జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను (NCLT) ఆశ్రయించారు. ఈ విషయమై హైదరాబాద్ NCLTలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తన తల్లి, సోదరి కుట్ర పన్ని షేర్లు బదిలీ చేసి తన భార్యకూ, తనకు కంపెనీపై ఆధిపత్యం లేకుండా చేశారని జగన్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం తన సోదరి షర్మిలకు, తనకు మధ్య ఎలాంటి ప్రేమానురాగాలు లేవని ఈ పిటిషన్లో జగన్ ప్రస్తావించడం కొసమెరుపు. ఏమాత్రం దాతృత్వం లేకుండా ఆమె తనపై చేస్తున్న ఆరోపణలు వ్యక్తిగత స్థాయికి దిగజారాయని, రాజకీయ శక్తుల ప్రోదల్భంతో ఆమె తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. జులై 2024లో సరస్వతి పవర్ కంపెనీ షేర్లను షర్మిల, విజయమ్మ అక్రమంగా వారి పేరిట బదలాయించుకున్నారని జగన్ ఆరోపించారు. ఎంఓయూ(MOU) నిబంధనలను ఉల్లంఘించి షేర్లను బదిలీ చేసుకున్నారని పిటిషన్లో తెలిపారు. తన సోదరికి, తనకు మధ్య సన్నిహిత సంబంధాలు లేవని అందువల్ల షేర్లు గానీ, ప్రాపర్టీస్ గానీ ట్రాన్స్ఫర్ చేసేందుకు తాను సిద్ధంగా లేనని పిటిషన్లో జగన్ స్పష్టం చేశారు.
జగన్ ఆయన భార్య భారతి ఈ పిటిషన్ ద్వారా ఎన్సీఎల్టీని ఏం కోరారంటే 74,26,294 ఈక్విటీ షేర్లు జగన్ నుంచి విజయమ్మ పేరిట, 40,50,000 షేర్లు భారతి నుంచి విజయమ్మ పేరిట, 12,00,000 షేర్లు తన పిటిషన్లో మెన్షన్ చేసిన మరో పిటిషనర్ నుంచి 3,4వ ప్రతివాదులుగా చేర్చిన వారి పేరిట షేర్ల బదలాయింపు జరిగిందని, ఈ ట్రాన్స్ఫర్స్ను రద్దు చేయాలని NCLTని కోరారు. అంతేకాదు కంపెనీ రిజిస్టర్ను సరిచేయాలని, వాటాదారులుగా వారి పేర్లను మార్చాలని, తాము పిటిషన్లో ప్రస్తావించిన ఇతర ప్రతివాదుల వాటా వివరాలను కూడా సరిచేయాలని జగన్, భారతి NCLTని ఆశ్రయించారు.