ప్రభుత్వ స్కూళ్లలో పెండింగ్ పనులు స్పీడప్ చేయాలి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో మొత్తం 955 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టగా, 801 పాఠశాలల్లో పనులు పూర్తి అయ్యాయని, 147 పాఠశాలల్లో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
జిల్లాలో డీఎంఎఫ్ టీ కింద నిధులు అందుబాటులో ఉన్నాయని, పనుల పురోగతి ప్రకారం వెంట వెంటనే బిల్లుల చెల్లింపు పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పనులు చేసేందుకు అడ్వాన్స్ కింద రూ.16.18 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఎంపీడీవోలకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టే పనుల కోసం రూ.12.28 కోట్లు విడుదల చేయగా ఇప్పటి వరకు రూ.6.49కోట్లు చెల్లింపు చేశామని, రూ.4.49 కోట్ల వరకు ఎంపీడీవోలు వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల వద్ద రూ.49 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో డీఈవో సోమశేఖర శర్మ, ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్, విద్యాశాఖ ప్రాజెక్ట్ అధికారి రామకృష్ణ, ఎంపీడీఓలు, ఎంఈవోలు, తదితరులు పాల్గొన్నారు.