ధన త్రయోదశి రోజున బంగారం ధరలు ఇలా ఉన్నాయేంటి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ధన త్రయోదశి రోజున బంగారం కొంటే అదృష్టం కలిసొస్తుందనేది ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం. కానీ.. ఈ ధన త్రయోదశికి మధ్య తరగతి జనం బంగారం కొనే పరిస్థితే కనిపించడం లేదు. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరుగుతూనే పోతున్నాయి. ఇవాళ(అక్టోబర్ 29, 2024) కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 650 రూపాయలు పెరిగింది. సోమవారం (అక్టోబర్ 28, 2024) 79,800 రూపాయలు ఉన్న 10 గ్రాముల(24 క్యారెట్స్) బంగారం ధర మంగళవారానికి 80,450 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధరలది కూడా ఇదే పరిస్థితి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 600 రూపాయలు పెరిగింది. తాజా పెరుగుదలతో 22 క్యారెట్ల బంగారం 73,750 రూపాయలు పలుకుతుంది. ఇదిలా ఉండగా ధన త్రయోదశి రోజు బంగారం కొనడం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది.
అమృతం కోసం దేవతలు పాలకడలిని చిలుకుతున్నప్పుడు శ్రీమహాలక్షీ ఉద్భవించింది. భార్యగా స్వీకరించిన మహావిష్ణువు ఆమెను ‘ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించిన రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. అందుకే మొదటి రోజును ధన త్రయోదశిగా చేసుకుంటారు. ఆ రోజున కొంత బంగారం అయినా కొంటారు. అయితే లక్ష్మీ నివాస స్థానం అయిన విష్ణువు గుండెల మీద భృగుమహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలోని కొల్హాపూర్కు చేరుతుంది. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి ఆ రోజున లక్ష్మీ పూజ చేస్తారు.