20 ఏళ్ల బంధానికి తెర ధనుష్, ఐశ్వర్యకు విడాకులు మంజూరు చేసిన కోర్టు
Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తన భార్య ఐశ్వర్యతో (Aishwarya Rajinikanth) 2022 లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కొన్నికారణాలవల్ల వాయిదా పడుతూనే వచ్చింది. తాజాగా బుధవారం (నవంబర్ 27, 2024న) ధనుష్, ఐశ్వర్యా రజనీకాంత్‌లకు చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఇక ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ కలిసి ఉండలేమని చెప్పడంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో వీళ్ల మధ్య ఉన్న 20 ఏళ్ల వివాహ బంధానికి తెరపడింది.
ఇటీవల గురువారం(నవంబర్ 21, 2024) చెన్నై ఫ్యామిలీ కోర్టులో న్యాయస్థానాన్ని ఆశ్రయించి. కలిసి ఉండాలనుకోవడం లేదన్న తమ నిర్ణయాన్ని తెలియజేశారు. అలాగే ఎందుకో విడిపోవాలని అనుకుంటున్నారో అందుకు గల కారణాలు వివరించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తాజాగా నవంబర్ 27న విడాకులు మంజూరు చేసింది.
గతంలో మూడుసార్లూ ధనుష్, ఐశ్వర్య విచారణకు హాజరు కాలేదు. ఇక ఎట్టకేలకు తమ సొంత నిర్ణయాలతో ముందుకొచ్చిన వీరికి కోర్టు విడాకులకు అంగీకరించింది.
అయితే ధనుష్ మరియు ఐశ్వర్య 2004 లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన దాదాపుగా 18ఏళ్ళ తర్వాత అంటే 2022 లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.
ఐశ్వర్య రజనీంకాంత్ తన భర్త ధనుష్ హీరోగా నటించిన '3' అనే సినిమాకి దర్శకత్వం వహించి తనలోని దర్శకత్వ ప్రతిభ నిరూపించుకుంది. ఇటీవలే తన తండ్రి రజనీకాంత్ హీరోగా నటించిన "లాల్ సలామ్" సినిమాని డైరెక్ట్ చేసింది.