చాంపియన్స్ ట్రోఫీపై నిర్ణయం నేటికి వాయిదా
Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. శుక్రవారం జరిగిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అత్యవసర సమావేశంలోనూ ఈ టోర్నీ నిర్వహణపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో మీటింగ్‌ను శనివారానికి వాయిదా వేశారు. హైబ్రిడ్ మోడల్ తమకు ఆమోదయోగ్యం కాదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోషిన్ నఖ్వీ స్పష్టం చేయడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
‘సభ్యుల మధ్య చిన్నపాటి సమావేశమే జరిగింది. చాంపియన్స్ ట్రోఫీ కోసం అన్ని పార్టీలు సానుకూల నిర్ణయం కోసం పని చేస్తున్నాయి. శనివారం దీనిపై నిర్ణయానికి రాకపోతే మరికొన్ని రోజుల పాటు ఈ మీటింగ్ కొనసాగొచ్చు’ అని ఐసీసీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. గత ఐదు రోజుల నుంచి దుబాయ్‌లోనే మకాం వేసిన నఖ్వీ వ్యక్తిగతంగా హాజరుకాగా, బీసీసీఐ సెక్రటరీ జై షా ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా.. పాకిస్తాన్‌కు వెళ్లబోదన్న బీసీసీఐ వైఖరిని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది.