పథకాలు రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని ప్రస్తుతం అందుతున్న పథకాలు అన్ని కొనసాగుతాయని ఈ సర్వే చేసిన తర్వాత కొన్ని స్కీమ్లు రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దని ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. రంగారెడ్ది జిల్లా శంకర్పల్లిలో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి ఆర్థిక, సామాజిక, విద్యా, కులానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడమేనని పేర్కొన్నారు. ఈనెల (నవంబర్) 30వ తేదీ వరకు సర్వే కొనసాగుతోందని తెలిపారు.
సర్వే చేసిన ఎన్యుమరేటర్ పూర్తి సమాచారాన్ని మీ ఇంటి గోడకు అతికిస్తారని అందులో ఏమైనా తప్పులు ఉంటే దగ్గరలోని ఎమ్మార్వోకు కాని, ఆర్డీవోకు కాని, లేదా కలెక్టర్కు కాని సరైన సమాచారమిచ్చి తప్పులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు అధికారులకు సమగ్ర సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమాచారం ప్రభుత్వానికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. 150 ఇండ్లకు ఒక ఎన్ముమరేటర్ను నియమించామని వారు ప్రతి ఇంటి సమాచారాన్ని సేకరిస్తారని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.