తెలంగాణలో చలి పంజా పలు ప్రాంతాలను కమ్మేసిన పొగ మంచు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో చలి పంజా విసరడం మొదలుపెట్టింది. శనివారం (నవంబర్ 2) తెల్లవారుజూమున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి చలి తీవ్రత పెరిగింది. చలి ప్రభావంతో పలు ప్రాంతాలనూ దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలను దట్టమైన పొగ మంచు ఆవరించడంతో రోడ్లు సరిగ్గా కనబడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
జగిత్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జగిత్యాల పట్టణాన్ని దట్టమైన పొగ మంచు దుప్పటిలా కమ్మేసింది. జగిత్యాల పట్టణంతో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లో దట్టమైన పొగ మంచు అలుముకుంది. పొగమంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగిస్తున్నారు. ధర్మపురి, ధర్మారం, వెల్గటూర్తో పాటు ఇతర మండలాల్లో రోడ్లు కనిపించలేనంత పొగ మంచు ఆవరించింది.
వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్లినా ఎదుటివారు కనిపించే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కోరుట్ల పట్టణాన్ని సైతం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 7:30 కావస్తున్నా పొగ మంచు దట్టంగా అలుముకోవడంతో రోడ్లపై దారి కనిపించక వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. లైట్ల వెలుతురులోనే ప్రయాణాలు సాగిస్తున్నారు.
ఆదిలాబాద్‌లోనూ పొగ మంచు కప్పేయడంతో జిల్లాలో కాశ్మీర్ వాతవరణంను తలపిస్తోంది. నిర్మల్ జిల్లా సోన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా డొప్లారా వరకు 44 వ నేషనల్ హైవే 125 కి.మీ వరకు పొగ మంచు ఆవరించింది. ఈ రహదారి మీదుగా నార్త్ ఇండియాకు రాకపోకలు సాగుతాయి. పొగమంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.