హైదరాబాద్ లో పెరుగుతున్న చలి కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగ మంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి పులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా15 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వారం రోజుల నుంచి చలి ముదిరింది. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో కూడా 12.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చేతులు, కాళ్లు శరీరంతో పాటు చెవులను కూడా కప్పి ఉంచుకోవాలని, లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు చలి తీవ్రత పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం కూడా మొదలవుతుందని కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.