ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా రోజూ చికెన్ తింటే డేంజర్ అంట
Health News భారత్ ప్రతినిధి : మీరు నాన్ వెజ్ ప్రియులా ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా అయితే, మీకోసమే ఈ కథనం. చికెన్ అతిగా తింటే తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు పెరుగుట, గుండె జబ్బులు, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2019లో జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ చికెన్ తినే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.
ముఖ్యంగా నాన్-హాడ్కిన్ లింఫోమా, ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తేలింది. అధిక ఉష్ణోగ్రతల వద్ద చికెన్‌ను వేయించడం లేదా గ్రిల్ చేయడం వల్ల హెటెరోసైక్లిక్ అమినో యాసిడ్స్ (HCA), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAH) వంటి క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి. వాటిని ఆరగించడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
జీర్ణక్రియ సమస్యలు...
చికెన్‌లో కనిపించే సాల్మొనెల్లా లేదా క్యాంపిలోబాక్టర్ ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రతి ఏడాది సుమారు మిలియన్ అమెరికన్ పౌరులు సాల్మొనెల్లా బారిన పడుతున్నారు. ఈ బాక్టీరియం ప్రధానంగా ఉడికించని చికెన్ ద్వారా వ్యాపిస్తుంది.
బరువు పెరుగుట...
చికెన్ ఉంటే నాలుగు ముద్దలు ఎక్కువ ఇంకొచ్చు అనుకునే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తిన్న తిండికి తగ్గట్టు శరీరానికి పని చెప్పకపోతే, అధిక బరువుకు దారితీయవచ్చు. నగ్గెట్స్, ఫ్రైడ్ చికెన్ వంటి ప్రాసెస్ చేసిన చికెన్ ఐటమ్స్‌లో అధిక మొత్తంలో సోడియం, కేలరీలు మరియు అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కావున మీ శరీరాన్ని రెండింతలు కాకుండా కాపాడుకోండి.
యాంటీబయాటిక్ రెసిస్టెన్స్...
జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఫారమ్‌లలోని కోళ్లలోకి ఇంజెక్ట్ చేసే యాంటీబయాటిక్స్, హార్మోన్లు మానవులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని పేర్కొంది. అలాంటి కోళ్ల నుండి వచ్చిన చికెన్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, హార్మోన్ సంబంధిత సమస్యలు రావచ్చు. కావున ముక్కల వాసనకు వీలైనంత దూరంగా ఉండండి.