అన్నీ పార్టీలకు మేఘా విరాళాలు ఇలా
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏంది అన్ని పార్టీలతో మేఘా కంపెనీ దోస్తీ చేస్తున్నది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దగ్గరవుతున్నది. తెలంగాణలో పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా మెదిలి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, మిషన్ భగీరథ లాంటి మేజర్ ప్రాజెక్టులు దక్కించుకున్న ఆ కంపెనీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కూ చేరువవుతున్నది. ఈ క్రమంలోనే రూ.1126.23 కోట్ల విలువైన నారాయణపేట– కొడంగల్ సెకండ్ ప్యాకేజీ - పనులను దక్కించుకుంది.
2014 నుంచి 2024 వరకు పదేండ్ల కాలంలో తనకు భారీ ప్రాజెక్టులు కట్టబెట్టిన బీఆర్ఎస్, బీజేపీకి మేఘా కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారీగానే చదివించుకుంది. ఫ్యూచర్ గేమింగ్అండ్ హోటల్ సర్వీసెస్ తర్వాత అత్యధిక విలువగల ఎన్నికల బాండ్లు కొన్నది మేఘా ఇంజినీరింగ్కంపెనీయే కావడం గమనార్హం. మేఘా మొత్తం రూ.966 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొంటే ఇందులో బీజేపీకి 60 శాతం మేర రూ.584 కోట్ల చందాలిచ్చింది. ఆ తర్వాత అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి రూ.195 కోట్ల విరాళాలు అందజేసింది.
మరే ఇతర ప్రాంతీయ పార్టీకి కూడా ఒక సంస్థ నుంచి ఇంత పెద్దమొత్తంలో ఎన్నికల విరాళం దక్కలేదు. అటు తమిళనాడులోనూ అక్కడి రూలింగ్పార్టీ డీఎంకేకు రూ.85 కోట్లు, ఏపీలో అప్పటి రూలింగ్పార్టీ వైఎస్సార్‌కాంగ్రెస్‌కు రూ.37 కోట్లు ఇచ్చిన మేఘా యాజమాన్యం.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు రూ.18 కోట్లు ఇచ్చింది. లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చినందుకు ప్రతిఫలంగానే నాడు రూలింగ్పార్టీలకు మేఘా కంపెనీ భారీగా విరాళాలిచ్చిందనే విమర్శలు వచ్చాయి. కాగా, నిరుడు డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మరోసారి కొత్త ప్రాజెక్టులు దక్కించుకోవడంపై మేఘా ఫోకస్ పెట్టింది.
సర్కారుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. మొన్నటి వరదల సమయంలో రూ. 5 కోట్ల సాయం ప్రకటించిన మేఘా సంస్థ తాజాగా స్కిల్ యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి సీఎస్ఆర్ కింద రూ. 200 కోట్ల భారీ మొత్తం కేటాయించింది. కొడంగల్-నారాయణపేట స్కీంకు రూ.2,260.85 కోట్లతో సెప్టెంబర్ 14న టెండర్లు ఖరారు కాగా, 1,134.62 కోట్లతో మొదటి ప్యాకేజీ పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్, ₹1,126.23 కోట్ల విలువైన రెండో ప్యాకేజీ పనులను మేఘా కంపెనీ దక్కించుకున్నాయి.
పార్టీలకు ఇచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలు....
* బీజేపీ : రూ.584 కోట్లు
* బీఆర్ఎస్ : కే, 195
* డీఎంకే : రూ. 85 కోట్లు
* వైఎస్సార్సీపీ : రూ.37 కోట్లు
* టీడీపీ : రూ. 28 కోట్లు
* కాంగ్రెస్ : రూ.18
* జేడీయూ : రూ.10 కోట్లు
* జేడీఎస్ : రూ. 5 కోట్లు
* జనసేన : రూ. 4 కోట్లు