అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఖాళీ సీట్లు ఇప్పుడే అప్లై చేసుకోండి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ విద్యలో ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి చక్కని అవకాశం. వ్యవసాయ, ఉద్యాన కోర్సులలో ఏర్పడిన రెగ్యులర్ కోట సీట్ల ఖాళీల భర్తీ చేయడం కోసం నవంబర్ 18 నుంచి మూడవ దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఫ్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డి. శివాజీ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరుగుతున్న స్పెషల్ కోటా ఫస్ట్ కౌన్సిలింగ్ ఆదివారంతో పూర్తయింది.
రెండు దశల్లో జరిగిన రెగ్యులర్ కోట కౌన్సిలింగ్, అలాగే ఆదివారంతో పూర్తయిన ఫస్ట్ స్పెషల్ కోట కౌన్సిలింగ్ తర్వాత వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో దాదాపు 213 ఖాళీలు ఏర్పడినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు వివరించారు. ఈ కోర్సుల్లో ఏర్పడిన ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్ - 80, బీవీఎస్సీ - 08, బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ - 70 బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ - 40, బిటెక్ ఫుడ్ టెక్నాలజీ -15. నవంబర్18 నుంచి జరిగే మూడవ దశ కౌన్సిలింగ్ ద్వారా ఈ కోర్సులలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ శివాజీ తెలిపారు.
మూడవ దశ కౌన్సిలింగ్ షెడ్యూలు, వివిధ కోర్సుల్లో ఏర్పడిన ఖాళీలు తదితర వివరాలు విశ్వవిద్యాలయ వెబ్సైట్ pjtau.edu.in లో పొందవచ్చు అని ఆయన వివరించారు. మెరిట్ ఆధారంగానే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయంలోని డిగ్రీ కోర్సులలో ఏర్పడిన రెగ్యులర్ కోట ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రకటన ద్వారా కోరారు.