బంగారం ధర ఇంత భారీగా పెరిగిందేంటి పుష్ప-2 టికెట్ రేట్ల మాదిరిగా
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పసిడి ధర పరుగులు పెడుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం(డిసెంబర్ 3, 2024) నాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 400 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 430 రూపాయలు పెరిగి 78వేల మార్క్ దిశగా దూసుకెళుతోంది. సోమవారం నాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 70,900 ఉండగా, మంగళవారం 71,300 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారానిది అదే దారి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం నాడు 77,350 రూపాయలు ఉండగా, మంగళవారం 77,780 రూపాయలు పలికింది.
డిసెంబర్ నెలలోని ఈ మూడు రోజులను గమనిస్తే బంగారం ధరలు తగ్గుతూపెరుగుతూ కనిపిస్తున్నాయి. డిసెంబర్ 1తో పోల్చితే డిసెంబర్ 2న 22 క్యారెట్ల బంగారంపై 600 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం డిసెంబర్ 1తో పోల్చితే డిసెంబర్ 2 నాటికి 10 గ్రాములపై 650 రూపాయలు తగ్గింది. కానీ.. డిసెంబర్ 3న మళ్లీ పెరగడం గమనార్హం. వెండి ధరల్లో డిసెంబర్ 2తో పోల్చుకుంటే డిసెంబర్ 3న కూడా ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 1న కిలో వెండి ధర లక్ష రూపాయలు ఉండగా, డిసెంబర్ 2 నాటికి 500 తగ్గి 99,500 రూపాయలు అయింది. డిసెంబర్ 3న కూడా ఇదే ధర స్థిరంగా కొనసాగుతోంది.
మన దేశంలో బంగారం, వెండి ధరలు డాలర్తో రూపాయి విలువతో సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన బంగారం, వెండి ధరలు నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా బంగారం, వెండి ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరెన్సీలో హెచ్చుతగ్గులు, బంగారానికి డిమాండ్‌లో, సరఫరాలో మార్పులు ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు. ఇండియాలో బంగారానికి డిమాండ్ బలంగా ఉంది. పసిడికి సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది.
పండుగలు, పెళ్లిళ్ల సమయంలో దీనిని భారీగా కొంటారు. చాలా మందికి దీనిని సురక్షితమైన ఆస్తిగా చూస్తారు. డిసెంబర్ లో 24 క్యారెట్ల బంగారం ధర లక్షకు చేరుకుంటుందని ఒకానొక సమయంలో భావించినప్పటికీ ఇటీవల తగ్గుతూ వచ్చింది. 2024 ముగిసే నాటికి బంగారం ధర 90 వేలకు చేరువ కావచ్చనే అంచనాలున్నాయి.