నెలరోజుల్లో 27 మంది అవినీతి అధికారులు అరెస్ట్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గడిచిన నవంబర్ నెలలో 27 మంది అవినీతి అధికారులను యాంటీ కరప్షన్బ్యూరో (ఏసీబీ) అరెస్ట్ చేసింది. ఇందులో ముగ్గురు ఔట్సోర్సింగ్సిబ్బంది ఉన్నారు. ఒకరిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నహా 17 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మరో మూడు కేసుల్లో ఏసీబీ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఈ మేరకు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
పంచాయతీరాజ్, విద్య, పోలీస్, మున్సిపల్, టీజీఎస్‌పీడీసీఎల్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, కమర్షియల్ ట్యాక్స్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్ శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు డీజీ తెలిపారు. ఈ కేసుల్లో మొత్తం రూ.3.54 లక్షలు అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే, ట్రాప్ కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఏఈఈ నిఖేశ్ కుమార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ తెలిపారు. సోదాలలో రూ.17,73,53,500 విలువైన ఆస్తులను గుర్తించినట్టు వెల్లడించారు.
ట్రాప్ కేసుల్లో దోషులకు శిక్షలు...
గత నెలలో మూడు కేసుల్లో నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. 2012లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ పీ అశోక్‌కు రెండేండ్ల జైలు శిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది.
2013లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సీనియర్ అసిస్టెంట్ జిలగం వెంకటేశ్వరరావుకు ఏడాది జైలు శిక్ష, రూ.20వేలు జరిమానా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ తొగురి పోచయ్య మూడేండ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధించింది. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064లో సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.