తెలంగాణలో పెరిగిన 400 MBBS సీట్లు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గత బీఆర్ఎస్ హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే వైద్యారోగ్య శాఖపై ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చుచేసింది. డిపార్ట్ మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేస్తుండటంతో పాటు ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలను సైతం పరిష్కరిస్తున్నది. ఏడాది కాలంలో ఏకంగా 7,332 పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్ బీ) భర్తీచేసింది. 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది. ములుగు, నారాయణపేట, మెదక్, గద్వాల, కుత్బుల్లాపూర్, నర్సంపేట, మహేశ్వరం, యాదాద్రిలో కాలేజీలు, హాస్పిటళ్లను ఏర్పాటు చేసింది. దీంతో ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున, మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ 400 సీట్లతో కలిపి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,690 నుంచి 4,090కి పెరిగింది. కొత్తగా 50 పీజీ సీట్లు మంజూరయ్యాయి.
వీటితో కలిపి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య 1191కు చేరింది. 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసింది. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. 16 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 960 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. వీటితో కలిపి ప్రభుత్వ పారామెడికల్ కాలేజీల సంఖ్య 12 నుంచి 40కి పెరిగింది. కొత్తగా ప్రారంభించిన ఒక్కో కాలేజీలో 60 సీట్ల చొప్పున 1680 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.