చలికాలంలోనూ కొబ్బరి నీళ్లు తాగండి ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూడండీ
Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : శీతాకాలం వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు అంతగా తాగరు. రోగాలు కూడా రెండు సీజన్లలో ఎక్కువుగా ఉంటాయి. చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. చలికి చర్మం పొడిబారి పోతుంది. శరీరంపై తెల్లటి చారలు ఏర్పడుతుంటాయి. కళ్లలో కాంతి తగ్గుతుంది. సహజంగా చలికాలంలో వాడే క్రీమ్స్, పౌడర్లు మిగిలిన కాలాల్లోకన్నా వేరుగా ఉంటాయి. వందలు, వేలు ఖర్చు పెట్టి అవన్నీ వాడేకన్నా మనకు సహజంగా దొరికే కొబ్బరి నీళ్లు ఎంతో మంచివని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు.
సహజంగా వీరసంగా ఉన్నప్పుడు, శరీరంలో పోషకాల శాతం తగ్గినప్పుడు, విరేచనాలు అవుతున్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. వేసివి కాలంలో కొబ్బరినీళ్లకు డిమాండ్ ఎక్కువ కానీ చలికాలంలో కూడా వారానికి ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి ఎంతో మంచిది. ఈ నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ కారకాలు శరీరంలో ముడతలు పడకుండా కాపాడతాయి. చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తాయి.
శీతాకాలంలో జీర్ణవ్యవస్థ మిగిలిన కాలాలంత వేగంగా పనిచేయదు. కానీ కొబ్బరి నీళ్లు జీర్ణవ్యవస్థ సక్రమంగా జరిగేలా చేస్తాయి. చలికాలంలో ముఖచర్మం కూడా బిరుసుగా మారుతుంది. లేత కొబ్బరిలో, పెరుగు కలిపి పేస్ట్ గా తయారు చేసి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. తక్షణ శక్తికి ఏ కాలంలో అయినా కొబ్బరి నీళ్లకు మించిన ఔషధం మరొకటి లేదు. కాబట్టి శీతాకాలం అని కొబ్బరి నీళ్లకు దూరంగా ఉందాల్సిన అవసరం లేదు.