మాట ఇచ్చాం ధరణిని బంగాళాఖాతంలో పడేశాం మంత్రి పొంగులేటి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో పడేస్తామని మాటిచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో పడేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. 2024, డిసెంబర్ 18వ భూ భారతి బిల్లును మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం భా భారతి బిల్లుపై మంత్రి పొంగులేటి చర్చను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్వోఆర్ చట్టం 2020 ప్రక్షాళన చేసి భూ భారతి తీసుకువచ్చామని క్లారిటీ ఇచ్చారు. దొరల గడీల్లో కూర్చొని గత ప్రభుత్వం తెచ్చిన చట్టాల్లో మార్పులు తెస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు గోడల మధ్య కూర్చొని అర్ధరాత్రి ధరణి తీసుకువచ్చిందని.. దీంతో రెవెన్యూ అధికారులు పరిష్కరించాల్సిన భూ సమస్యలు కూడా కోర్టు వెళ్లాయని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అందరి సలహాలు, సూచనలతో భారతి బిల్లు తయారీ చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ మాదిరి కాకుండా 33 జిల్లాలోని ప్రజలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రతిపక్ష నేతల సూచనలను పరిగణిలోకి తీసుకుని భూ భారతి బిల్లు రూపొందించామని అన్నారు. భా భారతి డ్రాఫ్ట్ బిల్లును వైబ్ సైట్లో అందరి అభిప్రాయాలు తీసుకున్నామని వివరించారు. దేశంలోని 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించామని పేర్కొన్నారు. అయితే ధరణి పోర్టల్ లో ఉన్న మంచి అంశాలను అలాగే కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు.
భేషజాలతో మేం ధరణి పోర్టల్ ను తీసేయడం లేదని దానితో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని అందుకే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. 22, 23 సార్లు డ్రాఫ్టులు మార్చి మెరుగ్గా భూ భారతి బిల్లును తెచ్చామని గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పార్టీ బీలో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. భూములను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని భరోసా ఇచ్చారు.