భోజనానికి ముందు నీళ్లు తాగొచ్చా తాగకూడదా ఏది నిజం
Health News ఆరోగ్య వార్తలు భారత్ ప్రతినిధి : భోజనానికి ముందు మంచి నీళ్లు తాగాలా భోజనం తర్వాత తాగాలా రోజుకు ఎన్ని నీళ్లు తాగితే మంచిది ఇలాంటి ప్రశ్నల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. కొందరు భోజనానికి ముందు తాగితే తక్కువ తింటాం అంటారు. ఇంకొందరు భోజనం తర్వాత తాగితే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదని చెప్తారు. రోజుకు నాలుగు లీటర్లు తాగాలని, అయిదు లీటర్లు తాగాలని లెక్కలు చెప్తుంటారు. కానీ ఎవరూ కచ్చితంగా చెప్పరు.
భోజనం తినేటప్పుడు నీళ్లు తాగితే ఎక్కువ తినలేరు.ఆకలి తగ్గిపోతుంది అని అంటారు. అలాగని తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు రావచ్చని సలహా ఇస్తారు. అంతేకాదు పొట్ట పెరిగే ప్రమాదం ఉందని కూడా భయపెడతారు. భోజనం తర్వాత నీళ్లు తాగితే బరువు పెరిగే అవకాశం ఎక్కువని మరికొందరు అంటారు. కొందరు ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేయడం కుదర కపోతే, కొంతసేపు ఆకలిని ఆపడానికి నీళ్లు తాగుతుంటారు. బరువు పెరగడానికి నీళ్లు తాగడానికి సంబంధం లేదని కొందరి అభిప్రాయం.
అసలు బరువును నీళ్లు తగ్గిస్తాయని చెప్తారు. నిజానికి ఎవరి శరీర తత్వాన్నిబట్టి వాళ్లు నీళ్లు తాగాలి. అంతేకాని ఒకరు చెప్పారని, ఏదీ చేయకూడదు. భోజనం చేసేటప్పుడు తాగినా.. తర్వాత తాగినా, ముందు తాగినా శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. దాహం వేసినప్పుడు నీళ్లు తాగకుండా నియంత్రించడం శరీరానికి మంచిదికాదు. రోజుకు కనీసం నాలుగు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలని వైద్యుల సలహా.