Type Here to Get Search Results !

Sports Ad

కానిస్టేబుల్స్కు 35 ఏళ్లుగా ప్రమోషన్లు లేవ్ Constables Have Been Without Promotions For 35 Years

కానిస్టేబుల్స్కు 35 ఏళ్లుగా ప్రమోషన్లు లేవ్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాచరికంలో రక్షకభటులు. ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు( కానిస్టేబుల్స్​). అధికారులకు, పాలకులకు పోలీసులే రక్షణ ఇస్తారు. ప్రజారక్షణ కోసం పోలీసు స్టేషన్లు ఏర్పడ్డాయి. అందులో ఎస్ఐ, ఏఎస్​ఐ, హెడ్​ కానిస్టేబుల్, కానిస్టేబుల్​లు ఉంటారు. హోంగార్డులూ ఉంటారు.  జీవనం కోసం మానవుడు ఏదో ఒక పనిచేయాలి కదా! ఇవాళ ఉన్నత చదువులు చదివి కూడా కానిస్టేబుల్​ ఉద్యోగాలకు వస్తున్నారు.

 ప్రమోషన్లు లేని కానిస్టేబుల్​గా జీవితాన్ని గడుపుతున్నారు.  జీతాలూ తక్కువే.   ఏ నాయకుడు వచ్చినా వారికి రక్షణగా నిలవాలి. పోలీస్​ స్టేషన్లలో గార్డు డ్యూటీ ప్రతిరోజూ  8 గంటలు.  దాంతో వాళ్ల మోకాళ్లు అరుగుతున్నాయి.  అనారోగ్యానికి గురవుతున్నారు. ఒక్కోసారి అవమానాల పాలవుతున్నారు.  ఏ ఉద్యోగంలోనైనా పదోన్నతి ఉంటుంది. కానీ పోలీసు కానిస్టేబుళ్లకు 35 ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేవు.  బీఏ, ఎంఏ,  బీటెక్, ఎంటెక్,  పీహెచ్​డీ  వంటి చదువులు చదివినవారు సైతం పురోగతి లేక చాలీచాలని జీతం వల్ల కుటుంబ పోషణలో అవమానాలను ఎదుర్కొంటున్నారు. విధి నిర్వహణలో నక్సల్స్​కు  టార్గెట్​గా మారుతున్నారు. చంపబడుతున్నారు.  రాజకీయ నేతలతో, అధికారులతో వారి బాధ చెప్పుకోలేని పరిస్థితి. 

దీనంగా పోలీసుల జీవితాలు...
ఒక డీఎస్పీ, ఎస్పీ కావాల్సిన పోలీసు​ కానిస్టేబుల్​గానే రిటైర్​ అవుతున్నాడు. ఇది అమానవీయం. ప్రభుత్వమే ఈ సమస్య పరిష్కరించాలి. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రులకు, మంత్రులకు,  న్యాయమూర్తులకు రక్షణగా నిలుస్తున్నవారిపై దయ చూపాలి.  విధి విధానాలతో పోలీసులకు, నక్సల్స్ మధ్య యుద్ధం సాగుతోంది.  మరి మరణిస్తున్నది ఎవరు?  దొరల దౌర్జన్యాలను ఎదిరించే నక్సల్స్​ విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో తలపడుతున్నారు. ఇద్దరు బహుజనుల మధ్య కొనసాగుతున్న యుద్ధం.  ఏది ఏమైనా పోలీసు వ్యవస్థ వద్దా మిలిటరీ వ్యవస్థ వద్దా అంటే.. రాజ్యం నడవాలంటే వారు అవసరమే. కానీ,  ప్రభుత్వాలు చేసే తప్పిదాలకు ఇరు పక్షాలు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం జరిగితే అధికారులు,  రాజకీయ నేతలు దాక్కుంటారు. బహుజనులైన ధైర్యవంతులు మరణిస్తారు.

 పోలీసులు, గన్​మెన్లు, హోంగార్డుల జీవితాలు దీనంగా ఉన్నాయి. వారి డిజిగ్నేషన్​ మార్చాలని  శంకరన్​ కమిటీ ఇచ్చిన నివేదిక తుంగలో తొక్కారు.  పోలీసు విభాగంలో పోలీస్​ అనే పదం వారిని కిందిస్థాయి ఉద్యోగులుగా చూపిస్తున్నది. ఇకనుంచి పోలీసులను అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్లు అని పిలవాలి. వీరికి  జీతభత్యాలు స్కూలు అసిస్టెంట్​ హోదాలో అమలుచేయాలి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్లు పోస్టులతో పనిలేకుండా అందరికీ హోదా పెంచాలి. 

సంస్కరణలు చేపట్టాలి...
పోలీసు విభాగంలో సంస్కరణలు చేపట్టాలి. పోలీసులు సీపీ స్థాయికి ఎదిగేలా చేయాలి. వారి కుటుంబాలను ఆదుకోవాలి.  గత 35 ఏండ్లుగా ప్రమోషన్లు లేక నోరు మెదపలేక ఇబ్బంది పడుతున్న పోలీసులకు తక్షణం ప్రమోషన్లు, నష్టపరిహారం ఇవ్వాలి. గన్​మెన్లుగా పోలీసులను వినియోగించరాదు. దీనికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పోలీసు డ్యూటీలు, గార్డు డ్యూటీలు అత్యంత ప్రమాదకరం. దీనిద్వారా వారు బలహీనులవుతున్నారు.అందువల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘రోబోటిక్’ వ్యవస్థ ద్వారా స్టేషన్​కు రక్షణ చేపట్టాలి. పోలీసులు ప్రజలు ఒక్కటే అన్నది గమనించాలి. కోటీశ్వరుల పిల్లలు కానిస్టేబులు ఉద్యోగాలకు రారు అని గమనించాలి. 

ఏఎస్​ఐగా డిజిగ్నేషన్​ ఇవ్వాలి...
పోలీసులను బానిసలుగా చూడరాదు. వారుకూడా కుటుంబాలు ఉన్నవారే. పోలీసు విభాగంలో తక్షణం  మార్పులు తీసుకురావాలి. కానిస్టేబుల్​ అనే పదం తొలగించాలి.  మొదటి రిక్రూట్ అయ్యే పోలీసులను అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టరుగా  నియామకం చేయాలి. ఉన్నత చదువులు చదివినవారు ఇందులోకి వస్తున్నారంటే బుక్కెడు బువ్వ కోసమే. వారిని అధికారులు బానిసలుగా చూడాలని కాదు. ప్రభుత్వాలు తక్షణం మార్పులపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. కానిస్టేబుళ్లకు అన్యాయం చేయడం సరికాదు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies