మరీ ఇంత అన్యాయమా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించింది కేంద్రం ఏం చేసింది
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కొత్తగా దక్కిందంటూ ఏమీ లేకపోగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆ రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే కోరినా బడ్జెట్లో ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కేంద్రం నుంచి సుమారు రూ.30 వేల కోట్లను గ్రాంట్ల రూపంలో తెలంగాణకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వ పథకాలు సవ్యంగా అమలయ్యేందుకు, నిధులు లేమితో పథకాల అమలులో జాప్యం జరగకుండా ఉండేందుకు రేవంత్ సర్కార్ కేంద్రాన్ని గ్రాంట్లను కోరింది. 2024-25 రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను రూ.21,636 కోట్లుగా ప్రభుత్వం చూపింది. అయితే.. గత 9 నెలల్లో కేవలం రూ.4,771 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తెలంగాణకు గ్రాంట్ల రూపంలో వచ్చాయి.
ఎప్పట్లాగే కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధులే తప్ప ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కిందేమీ లేదు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీ, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం సహా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు కోరింది.