రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు అప్లికేషన్లు 16 లక్షలు ముగిసిన గడువు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు సోమవారం నాటితో దరఖాస్తు గడువు ముగిసింది. ఈ పథకం కోసం సుమారు 16 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా ప్రభుత్వ సెలవులు రావటం, అప్లికేషన్ చేసుకునేందుకు సర్వర్ ప్రాబ్లమ్ రావటంతో అప్లికేషన్ కు గడువును మరోసారి పొడిగించాలని అధికార పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు కోరినప్పటికీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. గడువు ముగిసిన చివరి రోజుల్లో పెద్ద ఎత్తున అప్లికేషన్లు పోటెత్తడంతో సర్వర్ డౌన్ కు దారితీసింది.
వాస్తవానికి ఈ నెల 4తోనే దరఖాస్తు గడువు ముగియగా ఈ నెల 14 వరకూ గడువును పొడిగించారు. గత కొద్ది రోజుల నుంచి ఈ పథకానికి అప్లై చేసేందుకు మీ సేవ కేంద్రాలు, ఇంటర్ నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తారు. శాఖల వారీగా అప్లికేషన్లు, ఎంత లోన్ కోసం ఎన్ని అప్లికేషన్లు వివరాలు, జిల్లాల వారీగా వచ్చిన అప్లికేషన్ల వివరాలను మంగళవారం వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. అప్లికేషన్లను మే 31 వరకు మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసి లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపనున్నారు. జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తరువాత జూన్ 2న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది.