తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్రికెట్‌ను ప్రోత్సహించాలి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో నిధుల దుర్వినియోగంతో పాటు అనేక అంశాల్లో నిబంధనల ఉల్లంఘనలపై బీసీసీఐ అంబుడ్స్‌మన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు హెచ్‌సీఏ చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్లేయర్లు హైదరాబాద్‌కు రాకుండా అన్ని జిల్లాలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపింది. హెచ్‌సీఏ సభ్యత్వంలో ఉన్న అసమానతలపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. 2018 నుంచి 2021 వరకు ఇచ్చిన ఆదేశాలను హెచ్‌సీఏ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెలిచాల ఆగం రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీసీసీఐ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
31 జిల్లాల నుంచి సభ్యులుండాలి...
తెలంగాణ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే 9 మంది సభ్యులు మాత్రమే కాకుండా 31 జిల్లాల నుంచి కనీసం ఒకర్ని ఓటింగ్ సభ్యుడిగా చేర్చాలని అంబుడ్స్‌మన్ తెలిపింది. ‘ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 6 నెలల్లోపు హైదరాబాద్ వెలుపల క్రికెట్ అభివృద్ధికి తీసుకున్న చర్యల నివేదికను రూపొందించి బీసీసీఐకి అందజేయాలి. అదే నివేదికను హెచ్‌సీఏ వెబ్‌సైట్‌లోనూ ఉంచాలి. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల్లో 25 శాతం జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాలి. ఇందుకోసం ఏజీఎమ్ నిర్వహించాలి. జిల్లా క్రికెట్ సంఘాలకు సొంత ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది. వివిధ ఏజ్ గ్రూప్‌ల్లో వందలాది మంచి ప్లేయర్లు, ప్రత్యేక టీమ్‌లు ఉన్నాయి.